నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 17: విద్యుత్తు కోతలను నిరసిస్తూ గురువారం కూడా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రైతులకు సంఘీభావంగా రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం రైతులతో కలిసి సబ్‌స్టేషన్ ముట్టడించి ఏఈ శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందజేశారు. కరెంటు కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. అనంతరం గవ్వలపల్లి- వెల్దుర్తి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కరెంటు సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయంటూ నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల రైతులు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటర్లు పనిచేయడం లేదని వాపోయారు. దాదాపు 200 ఎకరాల పంటలకు సాగునీరు అందడం లేదని ఆవేదనచెందారు. కరెంటు కష్టాలతో అల్లాడుతున్నా ప్రభుత్వం తమ బాధను పట్టించుకోవడంలేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ రైతులు పరిగి-మహబుబ్‌నగర్ రహదారిపై బైఠాయించారు. పక్షం రోజుల క్రితం విద్యుత్తు ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘ఎమ్మెల్యే గ్రామానికో న్యాయం.. మా గ్రామానికో న్యాయమా?’ అని రైతులు నిలదీశారు. సరిహద్దు గ్రామమైన కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో కరెంటు ఉండి తమ దగ్గర ఎందుకుంటలేదో తెలుపాలని అధికారులను నిలదీశారు.