హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన జలగం ప్రసాదరావుకు ఇప్పుడున్న భద్రతను కొనసాగించాలని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 1+1 భద్రతను ఉపసంహరించాలన్న నిర్ణయంపై జలగం ప్రసాదరావు అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తండ్రి జలగం వెంగళరావు మాజీ ముఖ్యమంత్రిగా నక్సలిజం ఉద్యమాన్ని అణిచివేసేందుకు గట్టి ప్రయత్నాలు చేశారని చెప్పారు.
మావోయిస్టుల వల్ల పిటిషనర్ ప్రాణాలకు ముప్పు ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, భద్రత సమీక్ష కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా భద్రతను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. వాదనలపై హైకోర్టు.. ఒక పిటీషనర్‌కు మాత్రమే భద్రత ఉపసంహరించారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. సమీక్ష కమిటీ ఇచ్చిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు భద్రతను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది.