హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమల వెళ్లారన్న కారణంగా పర్యాటకశాఖ కార్పొరేషన్ ఎండీ బీ మనోహర్రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఎన్నికలు పూర్తయినా ఓ అధికారి సస్పెన్షన్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అభిప్రాయపడింది.
సస్పెన్షన్ వేటు ఎత్తివేయడమో లేక శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడమో చేయకుండా కాలయాపన చేయడం సబబు కాదని తెలిపింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించినప్పటికీ ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పటికే విచారణను రెండుసార్లు వాయిదా వేశామని గుర్తుచేసింది. డీజీపీ విషయంలో సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం ఈ అధికారి విషయంలో ఎందుకు స్పందించడంలేదో తెలుపాలని కోరింది. తదుపరి విచారణలోగా దీనిపై నిర్ణయం తీసుకోని పక్షంలో బాధ్యులైన పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ధికరణను ఎదురోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది.