High Court | హైదరాబాద్, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ): కారుణ్య నియామకంలో పెళ్లయిన కుమార్తె దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినతిపత్రంతోపాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. ఏఎస్ఐగా పనిచేసిన తన భర్త మరణించినందున, కారుణ్య నియామకం కింద తన కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలంటూ షాహీన్ సుల్తానా అనే మహిళ ఇచ్చిన వినతిపత్రాన్ని పోలీస్ కమిషనర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షాహీన్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నామారపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతుడు తనపై ఆధారపడిన వారిలో భార్య పేరు మాత్రమే ఇచ్చారని, పిటిషనర్‌కు ఉద్యోగం చేసే కుమారుడు ఉన్నాడని, ఇద్దరు కుమార్తెలకు వివాహం అయ్యిందని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించాకే పిటిషనర్ దరఖాన్తును అధికారులు తిరసరించారని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. షాహీన్ యోగక్షేమాలు చూస్తున్న కుమార్తె నిరుద్యోగి అని, తల్లి అనారోగ్యానికి తగిన చికిత్స అందించలేకపోతున్నారని చె ప్పారు. పెళ్లయినప్పటికీ కారుణ్య నియామకానికి అర్హురాలేనని జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తుచేశారు. వాదనలు విన్న హైకోర్టు, పిటిషనర్ 3 వారాల్లోగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అందులో కుమార్తె భర్త ఆర్థిక పరిస్థితులను కూడా వివరించాలని, దరఖాస్తు ను అందుకున్న అధికారులు 8 వారాల్లోగా దానిపై చట్ట ప్రకారం తగిన నిర్ణ యం తీసుకోవాలని తీర్పు చెప్పింది.