హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి గాదగోని చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేర కు నమోదైన కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును అరెస్టు చేయరాదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని కూడా పంజాగుట్ట పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హరీశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆయనను ఆదేశించింది. పంజాగుట్ట పోలీసులు ఈ నెల ఒకటిన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హరీశ్ తరఫున సీనియర్ న్యాయవాది జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై మోపిన అభియోగాలకు, నమోదు చేసిన చట్ట నిబంధనలకు పొంతన లేదని తెలిపారు. పిటిషనర్‌పై నమ్మకద్రోహం (ఐపీసీ 409 సెక్షన్), ప్రాణ భయం (ఐపీసీ సెక్షన్ 386) సెక్షన్ల కింద గౌడ్ చేసిన ఫిర్యాదులోని అభియోగాలకు ఆధారాలు లేవని చెప్పారు. హరీశ్‌రావు మంత్రిగా ఉండగా చక్రధర్ గౌడ్, ఆయన కుటుంబసభ్యుల ఫోన్ల్లు ట్యాపింగ్ చేయించారంటూ ఈ నెల ఒకటిన చేసిన ఫిర్యాదుకు ఆధారాలు పేర్కొనలేదని తెలిపారు. రాజకీయంగా ఎదురొనలేక తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.
ఆపిల్ ఫోన్ల కంపెనీ నుంచి వినియోగదారులు అందరికీ తరుచుగా వచ్చే ఒక మెసేజ్ (‘మీ ఫోన్ ట్యాపింగ్ అవుతోంది’)ను ఆధారంగా చేసుకుని గౌడ్ తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రముఖ సెల్ఫోన్ల కంపెనీల నుంచి వారి వినియోగదారులు అందరికీ ఆ తరహా మెసేజులు వస్తాయని చెప్పారు. ఫోన్ల ట్యాపింగ్ చేశారంటూ గత నవంబర్ 22న దాఖలుచేసిన పిటిషన్‌ను గౌడ్ హైకోర్టు నుంచి ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. ఆ తర్వాత రోజునే, డీజీపీకి గౌడ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తిరిగి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే దానిని కమిషనర్ పంజాగుట్ట పోలీసులకు పంపించారని చెప్పారు. కమిషనర్ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. రాజకీయ కుట్రతో చేసిన ఫిర్యాదును పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. రాజకీయ కుట్రతో నమోదైన కేసులో పోలీసులు హరీశ్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నందున ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రజల్లో ఉన్న పేరు పతిష్ఠలు దెబ్బతిసేందుకే హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారని అన్నారు. చక్రధర్‌గౌడ్ 2021 నుంచి హరీశ్‌రావుపై నిత్యం ఏదో ఒక కేసు నమోదు చేస్తూనే ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున సిద్దిపేటలో పోటీ చేసిన గౌడ్ ఓడిపోయారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కూడా హరీశ్ బెదిరించారని ఆనాడే కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయాక హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ కూడా దాఖలు చేశారని వివరించారు. కక్షతో, కుట్రపూరితంగా కట్టుకథలతో గౌడ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరారు.
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. ఆపిల్ కంపెనీ నుంచి గౌడ్‌కు ఫోన్ ట్యాపింగ్ అవుతోందని ఈమెయిల్ ద్వారా మెసేజ్ వచ్చిందని, హరీశ్‌రావే ఫోన్ ట్యాపింగ్ చేయించారనే అభియోగాలపై నమోదైన కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని కోరారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటని, కానీ, ఇకడ గౌడ్, అతని కుటుంబసభ్యుల ఫోన్ల ట్యాపింగ్ ప్రయత్నాలపై పోలీసులను విచారణ దశలోనే అడ్డుకోరాదని, స్టే ఇవ్వరాదని కోరారు. పోలీసుల దర్యాప్తును అడ్డుకోరాదని కోరారు.
విచారణ సందర్భంగా హైకోర్టు చక్రధర్‌గౌడ్‌కు పలు ప్రశ్నలు సంధించింది. గౌడ్ ఫిర్యాదును అందుకున్నట్టుగా డీజీపీ ఆఫీస్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఏదని ప్రశ్నించింది. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చాక పోలీసులు ఐపీసీ కింద కేసు ఎలా నమోదు చేస్తారంటూ సందేహం వ్యక్తం చేసిం ది. ఆపిల్ ఫోన్ల కంపెనీ నుంచి.. ‘మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది’ అన్న మెసేజ్‌లు వినియోగదారులు అందరికీ వస్తాయని చెప్పింది. ఆపిల్ కంపెనీ నుంచి గత ఏడాది మెసేజ్ వస్తే, ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. కారణాలను కూడా సదరు ఫిర్యాదులో గౌడ్ పేరొనలేదని తప్పుపట్టింది. ‘పిటిషనర్ (హరీశ్)ను అరెస్టు చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తాం’ అని తేల్చి చెప్పింది. ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠినచర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. దర్యాప్తునకు పిటిషనర్ సహకరించాలని తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈలోగా, చక్రధర్ గౌడ్ తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.