హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉంచిన జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని టీజీఎస్పీడీసీఎల్కి ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2,500 లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం టీజీఎస్పీడీసీఎల్ 2019లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టుల్లో మెరిట్ అభ్యర్థులకు 5%, స్థానికులకు 95% కేటాయించడం అ న్యాయమంటూ 25 వ్యాజ్యాలు దాఖలయ్యయి.
వీటిపై గ తంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. లైన్మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులను వర్తింపజేయడం చెల్లదని తీర్పు చెప్పారు. ఆ నోటిఫికేషన్లోని పార్ట్-2లో పేర్కొన్న కొన్ని నిబంధనలను కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ టీజీఎస్పీడీసీఎల్ 25 అప్పీళ్లు దాఖలు చేసింది. వాటిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ జరిపి పై ఆదేశాలు జారీ చేసింది.