హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): నేర తీవ్రత ఎకువగా ఉన్న కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టులు మొగ్గుచూపవని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సాక్ష్యాలు, ఆధారాల్లాంటి పూర్వాపరాల్లోకి వెళ్లజాలవని, అప్పీలుపై తుది విచారణ సందర్భంగానే వాటిని పరిశీలిస్తాయని పేర్కొన్నది. నిషేధిత ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో పదేండ్ల శిక్షను ఎదురొంటున్న నిందితులు బండారు హనుమంతరెడ్డి (హైదరాబాద్), వాసంశెట్టి నరేశ్ (తూర్పుగోదావరి జిల్లా) బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2016లో డీఆర్ అధికారులు మెదక్ జిల్లా జిన్నారంలోని వెంకట రాఘవ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించి, 132 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు దాని తయారీకి ఉపయోగించే ముడిపదార్ధాలు, రసాయనాలు, యంత్రాలు, పరికరాలను సీజ్ చేశారు.
ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులకు 10 ఏండ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ 2022లో కింది కోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుపై హనుమంతరెడ్డి, నరేశ్ గతంలో అప్పీల్ పిటిషన్లు వేయడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ డీఆర్ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో నిందితులు లొంగిపోవాలని, వారి బెయిల్పై హైకోర్టు తాజాగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరు మళ్లీ బెయిల్ పిటిషన్లు వేశారు. వాటిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్.. నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు.