హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ దాఖలు చేశారంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. ప్రజాప్రయోజనం లేకుండా వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించి జోగయ్య ఈ పిల్ దాఖలు చేశారని, తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న సీబీఐ కేసుల విచారణను 2024 సాధారణ ఎన్నికలకు ముందే పూర్తిచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.
ఆ పిల్‌కు కేసు నంబర్‌ను కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించడంతో ఫైలింగ్ నంబర్ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేట్టింది. గతంలో మంత్రిగా, ఎంపీగా పనిచేసిన జోగయ్య సీబీఐ డైరెక్టర్‌కు లేదా సీబీఐ కోర్టుకు వినతిపత్రం సమర్పించకుండా నేరుగా పిల్ దాఖలు చేయడాన్ని ఆక్షేపించింది. రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామంటూ పిల్ వేసి, ఉత్తర్వులు కోరడం ద్వారా కింది కోర్టును భయపెట్టి పనిచేయించాలనుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పిన అధికారిక ఉత్తర్వుల ప్రతిని పిటిషనర్‌కు ఆందజేయాలని పేర్కొన్నది. ఆ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది.