హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. 2012 డిసెంబర్ 8న నిజామాబాద్ లో, 2012 డిసెంబర్ 22న నిర్మల్‌లో ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులను ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 13న కొట్టేసింది. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాది కరుణ సాగర్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఒవైసీకి వ్యక్తిగత నోటీసులు జారీ చేశారు.
మత విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదు చేసిన రిమాండ్ రిపోర్టును కింది కోర్టు తిరసరించడాన్ని మంగళ్‌హాట్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థన మేరకు కేసు విచారణ నవంబర్ 11కు వాయిదా పడింది.