హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని జ్రెస్టా విల్లా ప్రహరీ గోడను ఏకపక్షంగా కూల్చివేసిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని నిలదీసింది. ఆ భూమి వివాదం కోర్టులో ఉండగా కూల్చివేయడానికి హైడ్రాకు ఎందుకంత తపన అని ప్రశ్నించింది. అకడి పరిస్థితులను యథాతథంగా కొనసాగించాలని స్టేటస్ కో ఆర్డర్ జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
హైడ్రా అధికారులు ఈ నెల 26న తమ ప్రహారీ గోడను కూల్చివేయడం అన్యాయమని పేరొంటూ జ్రెస్టా విల్లా ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్ 84లో ఉన్న మొత్తం భూమిలో 8.14 ఎకరాలు పట్టా స్థలం అని, ఇందులో 1.09 ఎకరాలను కొత్తచెరువు కోసం సరారీ శిఖంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని వివరించారు. మిగిలిన 6.14 ఎకరాలను గోల్డ్ ఫిష్ అడోబ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ కంపెనీ భూమి యజమానులతో అగ్రిమెంట్ చేసుకొని విల్లాలు నిర్మించి పిటిషనర్ల సొసైటీకీ 2019లో అప్పగించిందని వివరించారు.
1.09 ఎకరాలకు సంబంధించి నిర్మాణ కంపెనీ, భూమి యజమానులకు మధ్య వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. అయితే అనిల్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారి మార్చి 31న మారింగ్ చేశారని తెలిపారు. ఫిర్యాదు వివరాలను కూడా తమకు తెలియపరచలేదని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వడానికి హౌసింగ్ సొసైటీ వారు హైడ్రా కార్యాలయానికి వెళ్లగా.. హైడ్రా కమిషనర్ కలవడానికి నిరాకరించారని చెప్పారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా సిబ్బంది ఈ నెల 26న అక్రమంగా విల్లా ఆవరణలోకి వచ్చి వెనుక వైపు ఉన్న ప్రహరీని కూల్చివేసే ప్రయత్నం చేయడంతో కోర్టుకు వచ్చినట్టు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. స్టేటస్ కో ఆర్డర్ జారీ చేస్తూ ప్రతివాదులైన హైడ్రా, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ, పోలీసులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయదా వేసింది.