హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలన్న వినతులను పరిశీలించాలని ఉత్తర్వులు జారీచేయడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్టు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన సీ కల్పన, మరో ఏడుగురి పేర్లను ఓటరు జాబితాలో చేర్చాలని, తద్వారా వారి నామినేషన్లను స్వీకరించి ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వుల వల్ల ఎన్నికల సంఘానికి ఎలాంటి నష్టం వాటిల్లదని జస్టిస్ మాననీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం పేర్కొన్నది.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దాఖలు చేసిన అప్పీలులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. ఆ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ఎస్ఈసీకి చట్టపరమైన అభ్యంతరాలేమైనా ఉంటే సింగిల్ జడ్జినే ఆశ్రయించాలని సూచిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.