హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, రాజకీయ నాయకుల మెప్పు కోసం వారు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్తే సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఓ భవన నిర్మాణానికి అనుమతి నిరాకరించడంపై గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ బీ వీణారెడ్డి తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని, భవన నిర్మాణానికి అనుమతి ఎందుకు నిరాకరించారని కమిషనర్‌ను ప్రశ్నించారు.
పిటిషనర్ చెప్తున్న స్థలంలో సగం ప్రభుత్వ భూమి ఉన్నదని కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో అక్కడ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని, హైకోర్టు ఆదేశం మేరకు ఆ స్థలాన్ని సర్వే చేశాకే నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కల్పించుకుని.. సర్వే చేపట్టేముందు పిటిషనర్‌కు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశం మేరకు నిరుడు డిసెంబర్ 18న పిటిషనర్ రూ.24,477 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక భవన నిర్మాణ అనుమతులు నిరాకరించరారని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఫీజు చెల్లించాక అనుమతి ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి ఉంటే దానిని పరిరక్షించాల్సిందేనని, ఇదే సమయంలో చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
రాజకీయ నాయకులు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలను ఎదురొనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని ఎలా కొలికి తీసుకొస్తారో చెప్పాలని అడగ్గా కమిషనర్ స్పందిస్తూ.. పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చి కార్పొరేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి.. తాజా సర్వే చేపట్టి అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నదో లేదో తేల్చాలని, అనంతరం భవన నిర్మాణ అనుమతి అంశంపై స్పందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జూన్ 13కి వాయిదా వేశారు. ఆలోగా సర్వే, ఇతర చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.