హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నామినేషన్ సందర్బంగా మల్లారెడ్డి తన విద్యార్హతకు సంబంధించి అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నెల 13న రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొంటూ కందాడి అంజిరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదన.. వినిపిస్తూ మల్లారెడ్డి అఫిడవిట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీంతో రిటర్నింగ్ అధికారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈ-మెయిల్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వివరించారు. దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ.. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి ఈ నెల 15న నిర్ణయాన్ని వెల్లడించినట్టు చెప్పారు. దీంతో అంజిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది.
రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలన్న విన్నపాన్ని తోసిపుచ్చుతూ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకున్నందున ఆయనపై చర్యలు చేపట్టాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొన్నది. రిటర్నింగ్ అధికారి వెలువరించిన ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవచ్చని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.