హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూసేకరణపై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలంటూ నిరుడు ఆగస్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ భూ సేకరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో రద్దు చేయకుండా పరిహార ప్రకటనను మా త్రమే నిలిపివేస్తూ సింగిల్ జడ్జి తీర్పు చెప్పారని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆ తీర్పు వెలువడే నాటికి ఉన్న మార్కెట్ విలువ ప్రకారంగా యాచా రం మండలంలోని మేడిగడ్డ గ్రామ రైతులకు పరిహారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభు త్వం తీరుబడిగా ఏడాది తర్వాత అప్పీల్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అప్పీల్‌ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అప్పీల్ దాఖలు జాప్యమవడంపై అడ్వకేట్ జనరల్ క్షమాపణ చెప్పారు. అనంతరం ప్రభుత్వ అప్పీల్‌పై తమకున్న అభ్యంతరాలను వివరిస్తూ కౌంటర్ వేస్తామని పిటిషనర్ల న్యాయవాది చెప్పడంతో తదుపరి విచారణను 2 వారాలకు వాయి దా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 680 దరఖాస్తులు అందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎస్సీ వెల్ఫేర్ 215, విద్యుత్ 98, రెవెన్యూ 94, మైనారిటీ వెల్ఫేర్ 90, పంచాయతీరాజ్, గ్రామీణాభివృధి 64, ఇతర శాఖలకు సంబంధించి 119 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.