Current Bill | బిజినేపల్లి, జూన్ 12: కరెంట్ బిల్లులను చూసిన వినియోగదారుల గుండె గుబేల్మంటున్నది. సాంకేతిక కారణాలతో అక్కడక్కడా పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో ఏకంగా రూ.21 కోట్ల విద్యుత్తు బిల్లు వచ్చింది. గృహజ్యోతి కింద ప్రతి వినియోగదారుడికి 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే జీరో బిల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. బిల్లులు రూ.కోట్లల్లో వస్తుండటంతో అవాక్కవుతున్నారు. ఖానాపురంకు చెందిన వేమారెడ్డి (సర్వీస్ నెంబర్ 1110000 51) మీటర్ కేవలం 0.60 కిలోవాట్‌కు సంబంధించినది.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో వందల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో వచ్చింది. 01-01-1970 నుంచి 05-06-2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్లు వినియోగించినట్టు, అందుకు రూ.21,47,48,569 కరెంట్ బిల్లు వచ్చినట్టు ఈ నెల 5న వినియోగదారుడికి ఇచ్చి న బిల్లులో ఉంది. గ్రామంలో పదిమందికి ఇలాగే రూ.కోట్లలో బిల్లులు వచ్చినట్టు తెలుస్తున్నది. అవగాహన లేని బయటి వ్యక్తులతో లైన్మెన్, జూనియర్ లైన్మెన్ విద్యుత్తు బిల్లులను ఇస్తున్నట్టు సమాచారం. అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో విద్యుత్తు శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్ వ్యక్తులతో చేయిస్తున్నారు. ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా.. సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువ వచ్చిన మాట వాస్తవమేనని, వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లులను వెంటనే సరిచేశామని వివరించారు.