హనుమకొండ, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలకు అంతే లేకుండాపోయింది. ప్రకృతికి ఎదురీది… సర్కార్ యూరియా ఇవ్వకపోయినా వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుకు (Paddy Procurement) నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం వరి కోతలు ఊపందుకున్నా.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామగ్రిని ఇప్పటికీ సమకూర్చలేదు. ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చి రిబ్బన్ కట్ చేసి మొక్కుబడిగా ప్రారంభించడం తప్పితే కాంటా అయ్యే పరిస్థితిలేదు. రైతులు వారం రోజులుగా వడ్లను తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. నిర్వాహకులు లేకపోవడం, కొనుగోలు జరగకపోవడంతో పందులు, కోతులు, దొంగల భయంతో రైతులు కేంద్రాల్లోనే కాపలా కాయాల్సి వస్తున్నది. తాజాగా మొంథా తుఫాన్ హెచ్చరికతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ఎప్పుడు వాన వస్తుందో, పంట ఏమవుతుందో? అని భయపడుతున్నారు. ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 ఇస్తామని చెప్పి గత యాసంగిలో మోసం చేసింది. వానకాలంలో సహజంగానే సన్న వడ్ల సాగు ఎక్కువ. కొనుగోలు కేంద్రాల్లోనే వీటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి. కష్టపడి సన్న వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. కేంద్రం సన్న వడ్లు క్వింటాకు రూ.2389 మద్దతు ధరగా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోసన్ ఇవ్వాలి. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేకపోవడంతో రూ.2100 చొప్పున మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తున్నది.
వడ్ల కొనుగోలు కోసం హనుమకొండ జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమలాపూర్, ఎల్కతుర్తి, పరకాల మండలాల్లో కోతలు మొదలయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడక్కడ రిబ్బన్ కట్ చేసి కేంద్రాలను ప్రారంభించినట్టు ప్రకటించారు. కొనుగోళ్లు జరుగుతున్నాయో లేదా అనేది పట్టించుకోవడంలేదు. వడ్లను కాంటా పెట్టే సామగ్రి, బస్తాలు, టోకెన్ బుక్కులు, తేమను కొలిచే యంత్రాలు కేంద్రాలకు రాలేదు. ఏ కొనుగోలు కేంద్రంలో సేకరించిన వడ్లు ఏ మిల్లుకు పంపాలనేది ఇంకా నిర్ణయించలేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు గతంలో ఇచ్చిన ట్యాబ్లో ఇప్పటికీ మిల్లుల కేటాయింపు వివరాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదు. అవసరమైన సామగ్రి లేకపోవడంతో నిర్వాహకులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లడంలేదు. తుఫాన్ హెచ్చరిక తర్వాత ఆందోళన చెందుతున్న రైతులు.. కాంటాలు మొదలు పెట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సామగ్రి, సమాచారం రాలేదని నిర్వాహకులు చెప్తున్నారు. వడ్లు తడవకుండా కనీసం టార్ఫాలిన్లు అయినా ఇవ్వాలని కోరుతున్నారు.