హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గురుకుల సొసైటీలో రెండు నెలల నుంచి విద్యార్థులకు డైట్ బిల్లులు, నాలుగు నెలల నుంచి సిబ్బందికి వేతనాలు, గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ అధికారులు మరమ్మతుతో పోయే దానికి ఉన్నదానిని కూల్చేసి కొత్త భవనం నిర్మించడం, అత్యవసర అవసరాల కోసం వినియోగించాల్సిన నిధులతో అద్దెలు చెల్లించడం విస్మయం కలిగిస్తున్నది. ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయం పక్కన సెక్యూరిటీ సిబ్బంది, హెల్పర్లు, డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు, భోజనాలు చేసేందుకు గతంలో ఓ భవనాన్ని నిర్మించారు.
అడ్మిషన్లకు సంబంధించి హెల్ప్‌డెస్క్ కూడా అక్కడే ఉంది. భవనంలో పలు మరమ్మతులు, అదనపు వసతుల కల్పనకు దాదాపు రూ.5 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ ఉన్నట్టుండి మరమ్మతుల బదులు నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.23 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకు ప్రభుత్వ ఆమోదం తీసుకోకుండానే, టెండర్లు పిలువకుండానే ఓ గుత్తేదారుకు పనులు అప్పగించారు. ఇప్పటికే స్లాబు వరకు భవన నిర్మాణం పూర్తయింది.
గురుకుల విద్యార్థులకు వసతులు, అత్యవసర బకాయిల చెల్లింపుల కోసమని సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుంచి ప్రభుత్వం రూ.60 కోట్లు విడుదల చేసింది. అందులోనుంచి ఎస్సీ గురుకుల సొసైటీకి రూ.20 కోట్లను మంజూరు చేసింది. సొసైటీకి సంబంధించి విద్యార్థుల డైట్ బిల్లులు 2 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. మెయింటెనెన్స్, స్వీపింగ్ అండ్ శానిటేషన్ నిర్వహణ బిల్లులు బకాయిలున్నాయి. ఐసీటీ (ఇన్మర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్స్ట్రక్టర్లు, హానరోరియం సిబ్బంది వేతనాలు 4నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. సొసైటీ ఉన్నతాధికారులు ఈ బకాయిలను చెల్లించకుండా అత్యవసర నిధులను భవనాల అద్దెలకు మళ్లించారు.
ప్రభుత్వం ఇటీవల అద్దెలకు సంబంధించి రూ.17.5 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులను సైతం బకాయిల చెల్లింపు కోసం వినియోగించకుండా మళ్లీ అద్దెలనే చెల్లించారు. సాధారణంగా అద్దెలను నెల గడిచిన తరువాత, సంబంధిత ప్రిన్సిపాల్స్ బిల్లులను సమర్పించాక చెల్లించడం పరిపాటి. కానీ సొసైటీ అధికారులు నెల గడవక ముందే, డిసెంబర్ నెలకు సంబంధించిన అద్దెలను కూడా అడ్వాన్స్‌గా చెల్లించారు.
సొసైటీకి సంబంధించి గరిష్ఠంగా రూ.5లక్షల వ రకు మాత్రమే సొంతంగా ఖర్చు చేసే అధికారం, పరిమితి ఉన్నది. కానీ అంతకు మించి ఇష్టారీతిన పాలనాపరమైన అనుమతులను జారీ చేస్తూ, నిధులను మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సొసైటీ ఉన్నతాధికారులు ఇటీవలనే డిపార్ట్మెంటల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేశారు. అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్, జాయింట్ సెక్రటరీ ఇందులో మెంబర్లు. ఇందులో ఫైనాన్స్ మినహా ఇతర సెక్రటరీలందరూ అకడమిక్ విభాగానికి చెందిన వారే.
సొసైటీలో తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ ఈ డీపీసీ సిఫారసు చేయడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలను తీసుకోవడంతోపాటు, అమలు చేయడాన్ని డీపీసీకి నేతృత్వం వహించిన అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ వ్యతిరేకించినా, సొసైటీ ఉన్నతాధికారుల తీరు మాత్రం మారలేదని తెలుస్తున్నది. దీనిపై ఈశాఖకు నేతృత్వం వహిస్తున్న మంత్రి అడ్లూరిలక్ష్మణ్ స్పందించకపోవడంపై సొసైటీ వర్గాలు మండిపడుతున్నాయి.