హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అతిథి గృహాన్ని దేశానికే తలమానికంగా నిర్మించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో ఉన్న వికార్ మంజిల్‌లో చేపట్టిన హైకోర్టు అతిథి గృహం, సాంస్కృతిక భవన నిర్మాణ పనులకు జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. వివిధ రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు వైద్యం, విద్య తదితర అవసరాల కోసం హైదరాబాద్‌కు వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తున్నదని అన్నారు. అతిథి గృహం అందుబాటులోకి వస్తే ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతులను తొలిసారి కల్పించబోయేది తెలంగాణ హైకోర్టేనని వెల్లడించారు. ప్రతిపాదన చేయగానే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పడంపై సంతోషాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
జనం గుర్తించేలా కోర్టు భవనాలు
కోర్టుల భవనాల నిర్మాణాలు ఎలా ఉండాలో నమూనాను రూపొందిస్తూ తయారుచేసిన ‘న్యాయ నిర్మాణ్’ పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ భూయాన్ ఆవిషరించారు. జస్టిస్ పీ నవీన్‌రావు నేతృత్వంలోని కమిటీ న్యాయ నిర్మాణ్ నమూనాను రూపొందించిందని సీజేఐ తెలిపారు. కలెక్టరేట్, తాసిల్దార్, పోలీస్ స్టేషన్ల భవనాల మాదిరిగానే ప్రజలు గుర్తించే రీతిలో కోర్టు భవనాలు జిల్లా, తాలూకా స్థాయిల్లో ఉండాలని అన్నారు. జడ్జీల పోస్టుల భర్తీతోపాటు మౌలిక వసతులు కల్పిస్తే అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.
న్యాయమూర్తిగా 22 ఏండ్లకుపైగా సేవలు
గత 22 ఏండ్ల 2 నెలలుగా న్యాయమూర్తిగా సేవలు అందించానని, ఈ నెల 27న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయబోతున్నట్టు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. ఈ స్థాయికి రావడానికి, న్యాయమూర్తిగా సేవలు అందించడానికి ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకొన్నారు.
18 నెలల్లో నిర్మాణం
2.27 ఎకరాల్లో, రూ.50 కోట్ల వ్యయ్యంతో 5 వీఐపీ సూట్లు, 20 సూట్లు, 12 డీలక్స్ గదులు, సాంసృతిక భవనాల నిర్మాణం జరుగుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు.