Current Charges | హైదరాబాద్ సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెల్ల రేషన్‌కార్డు కలిగిన 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల పడుతున్న భారాన్ని ఇతర క్యాటగిరీల వినియోగదారుల మీద మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా? నూతన సంవత్సర కానుకగా విద్యుత్తు చార్జీల పెంపుదల తప్పదా? డిస్కంలు బుధవారం రాత్రి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించిన ప్రతిపాదనలు చూస్తే ఈ అనుమానమే కలుగుతున్నది. గృహజ్యోతి ద్వారా కోల్పోతున్న ఆదాయాన్ని రాబట్టుకునేందుకు బిల్లుల పెంపునకు అనుమతించాలనేది డిస్కంల ప్రతిపాదనల సారాంశం.
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నది. అయితే, ప్రభుత్వం ఈ సబ్సిడీని డిస్కంలకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నది. దీంతో డిస్కంలు భారీగా ఆదాయం కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకోవాలంటే చార్జీల పెంపే శరణ్యమని డిస్కంలు భావిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర చార్జీలు పెంచేందుకు అనుమతించాలంటూ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి.
ఎల్టీ (లోటెన్షన్) క్యాటగిరీలోని 300 యూనిట్లకుపైగా కరెంటు వాడుతున్నవారికి ఫిక్స్డ్ చార్జీల కింద ప్రస్తుతం ప్రతి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.50కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీంతో ప్రస్తుతం రూ.30 వరకు విధిస్తున్న ఫిక్స్డ్ చార్జీలు రూ.150కి పెరగనున్నాయి. ఈ లెక్కన 300 యూనిట్లకుపైగా కరెంట్ వినియోగిస్తున్న సుమారు 26 లక్షల మందిపై దాదాపు ఐదు రెట్ల భారం పడనున్నది. డిస్కంల ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. హెచ్‌టీ (హైటెన్షన్) క్యాటగిరీలోని వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీలతోపాటు కరెంట్ బిల్లులు సైతం భారీగా పెరగనున్నాయి.
-ప్రస్తుతం 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై కెపాసిటీ కనెక్షన్లు ఉన్నాయి. ఈ విభాగంలో మూడు సబ్ క్యాటగిరీలకు వేర్వేరుగా చార్జీలు విధిస్తున్నారు. 11 కేవీ కింద కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున, 33 కేవీ కనెక్షన్‌దారులకు రూ.7.15, 132/ఆపై క్యాటగిరీలోని వారికి రూ.6.65 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక మీదట అన్ని క్యాటగిరీలకు 11 కేవీలోని వినియోగదారులకు మాదిరిగా రూ.7.65 చొప్పున వసూలు చేసేందుకు అనుమతివ్వాలని డిస్కంలు కోరుతున్నాయి. అంటే 33 కేవీ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, 132 కేవీ వారికి రూపాయి చొప్పున చార్జీలు పెరగనున్నాయి.
డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ రాష్ట్రంలోని మూడు చోట్ల ప్రజల సమక్షంలో విచారణ చేపడుతుంది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తుంది. తదనంతరమే చార్జీల పెంపునకు అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావాలంటే దాదాపు మూడు నెలల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం లభిస్తే, వచ్చే కొత్త సంవత్సరం (జనవరి) నాటికి కరెంట్ చార్జీలు పెరిగే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు.