హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతే సస్పెండ్ అయిన వారు కొందరు! టికెట్ కొట్టిన తర్వాత అంత డబ్బు లేదని బస్సు దిగితే ఆ టికెట్ వేరే ప్రయాణికుడికి ఇచ్చి ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్లు ఇంకొందరు! అలా ఒకరో, ఇద్దరో కాదు.. దాదాపు 1,600 మందికిపైగా ఆర్టీసీ కార్మికుల బతుకులు ఇలాంటి చిన్న చిన్న తప్పులకు రోడ్డునపడ్డాయి. వాళ్లేమీ ఆర్టీసీకి చెందిన వేల కోట్ల ఆస్తులు తినలేదు. విధి నిర్వహణలో తెలిసీ, తెలియక చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నవారు. వారందరూ తమ ఆవేదన చెప్పుకునేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు వస్తే అక్కడి సిబ్బంది, పోలీసులు గెంటేశారు. దీంతో నిరాశతో వెనుదిరుగారు. పై అధికారులు తమను అక్రమంగా తొలగించారని, ఎండీ సజ్జనార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వారంతా కదిలి వచ్చారు.
తమను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని నాడు రేవంత్‌రెడ్డి చెప్పాడని, కానీ 15 నెలల నుంచి తాము తిరగని చోటు లేదని చెప్పుకొచ్చారు. రవాణాశాఖ మంత్రికి, ఆర్టీసీ ఉన్నతాధికారులను పలుమార్లు దరఖాస్తులు ఇచ్చామని కన్నీటి పర్యంతమన్నారు. చిన్నచిన్న తప్పులకు తమ బతుకులపై కొట్టడంతో ఇప్పటికే 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు.
అప్పుడు మా అత్తమామలు నిర్బంధిస్తే నేను డ్యూటీకి రాలేకపోయిన. ఆ తర్వాత భర్త చనిపోయిండు. ఇంట్లోంచి గెంటేస్తున్నరు. ఇద్దరు పిల్లలతో బతకలేకపోతున్నా. (చేతులు జోడించి) మాకు క్షమాభిక్ష పెట్టండ్రి. ఆపదలున్నం ఆదుకోండి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం. మమ్మల్ని విధుల్లోకి తీసుకొమ్మని చెప్పినా అధికారులు పంతం పడుతున్నరు. సిద్దిపేట నుంచి వచ్చినా. ఇల్లు గడవక ఏదో ఒక పని చేసుకుని బత్కుతున్నం. మమ్మల్ని ఆదుకోండన్నా.
– సమీనా బేగం, సిద్దిపేట