ఖమ్మం, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజు మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. మహా పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై రామయ్యకు పట్టువస్ర్తాలు సమర్పించారు. గవర్నర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు పూర్ణకుంభం, వేదమంత్రాలతో స్వాగతం పలికారు.
భక్తులు స్వామివారికి చేయించిన స్వర్ణ సింహాసనాన్ని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసి దానిపై శ్రీరాముడికి పట్టాభిషేక తంతు నిర్వహించారు. తొలుత శ్రీరామ బంగారు పాదుకలు, రాజనీతిని తెలియజేసే రాజదం డం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరామునికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడ లక్ష్మణస్వామికి, తామరం, బంగారం ఛత్రం, రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు పట్టాభిషిక్తుడైన రామయ్య కు సమర్పించారు. ప్రధాన లాంఛనమైన సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేయగా భక్తజన కోటి కరతాళ ధ్వనులతో జేజేలు పలికారు.
దేవేంద్రుడు రామయ్యకు కానుకగా పంపినట్టు చెప్పే ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తికి, ఆ తర్వాత సీతమ్మ తల్లికి, చివరగా రామభక్త సామ్రాజ్యానికి రారాజు అయి న హనుమంతునికి సమర్పించి అర్చకులు ప్రోక్షణ గావించారు. వేదాశీర్వచనం, అష్టోత్తర శతహారతి 108 ఒత్తులతో వెలిగించి శ్రీరామచంద్ర ప్రభువుకు సమర్పించడంతో మహా పట్టాభిషేకం సుసంపన్నమైంది. కార్యక్రమం లో ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాద్రి దేవస్థానం ఈవో దామోదర్‌రావు, న్యాయమూర్తి శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.