మహబూబ్నగర్ : రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో మోదీ సర్కార్ చేతులెత్తిసింది. కుంటిసాకులతో రైతాంగం నోట్లో మట్టికొట్టేందుకు బీజేపీ పాలకులు కుట్రలు పన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్టేజీ వద్ద ప్రాథమిక పీఏసీఎస్ కోటకదిర ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రం మెడలు వంచేందుకు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పోరాటం చేసిందన్నారు. అయినా కేంద్రం దిగి రాలేదన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్నిఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారని ఆయన తెలిపారు. కొనుగోళ్ల బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకుని రైతు పండించిన వరికి దేశంలో ఎక్కడా లేని విధంగా 1960 రూపాయల కనీస మద్దతు ధర ను ప్రకటించారన్నారు.
జిల్లా లో 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. రైతాంగాన్ని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతటి సాహసం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుతో పాటు కనీస మద్దతు ధర కల్పించినందుకు రైతులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్ర పటాలకు వరి ధాన్యంతో అభిషేకం చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, PACS చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, PACS వైస్ ఛైర్మన్ తిరుపతియ్య, జిల్లా రైతు బంధు డైరెక్టర్ మల్లు నర్శింహ రెడ్డి, ఎంపీపీ సుధ శ్రీ, జిల్లా అదనపు కలెక్టర్లు తేజాస్ నందులాల్ పవార్, సీతారామ రావు పాల్గొన్నారు.