పారిశుద్ధ్య నిర్వహణపై జీహెచ్ఎంసీ చేతులెత్తేయడంతో వీధివీధినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వ్యాపిస్తున్నది. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్లోని నల్లగుట్ట సీ-లైన్ రోడ్డులో సోమవారం నాటి దృశ్యమిది. ఎత్తేవాళ్లు లేక రోడ్డునిండా చెత్త నిండిపోయింది. స్థానికులే కాదు, ఆ దారిన వెళ్లేవాళ్లూ, బడిపిల్లలూ అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా హైదరాబాద్ మహానగరం మురుగు కూపంలా మారింది. చిన్న వర్షానికే నగరమంతా చెత్తాచెదారం, మురుగు నీటితో నిండిపోతున్నది. ప్రధాన రహదారుల నుంచి బస్తీల్లోని గల్లీల దాకా ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండి బురదమయమవుతున్నది. చెత్త, వరద నీటి నిర్వహణ సరిగ్గా లేక దారులన్నీ కంపు కొడుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా, జలమండలి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నగర ప్రజలు వాపోతున్నారు. అత్తాపూర్ నుంచి జియాగూడ వెళ్లే దారిలోని మొఘల్ కా నాలా ప్రాంతంలో రోడ్డు పక్కన భారీగా చెత్త పేరుకుపోయింది. అక్కడే నీరు నిల్వ ఉండి చెత్త, మురుగు కలిసి కంపుకొడుతున్నది. అటుగా వెళ్లే వాహనదారులు, చుట్టుపక్కన వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జియాగూడ నుంచి వంద ఫీట్ల రోడ్డుపైనే మేకలు, గొర్రెల కళేబరాలు పడేస్తున్నారు.
ఓవైపు డంపింగ్ యార్డు దుర్వాసన, మరోవైపు కళేబరాల దుర్వాసన కలిసి ఆ ప్రాంత ప్రజల ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో నాలా మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు పైపులతో నీటిని బయటకు తోడుతున్నారు. ఆ నీరు దుకాణాల ముందు నిల్వ ఉండి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోజుల తరబడి పనులు కొనసాగుతుండటంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వస్తున్నదని స్థానికులు చెప్తున్నారు. లంగర్‌హౌస్-ఉస్మాన్‌సాగర్ రోడ్డులోని తారామతి సమీపంలో రోడ్డుపైనే కోళ్లు, చేపల వ్యర్థాలు పడేస్తున్నారు. వాటిని రోజుల తరబడి తీయకపోవడంతో కంపు కొడుతూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆ చెత్తలోనే వర్షపు నీరు నిల్వడంతో ప్రమాదకర క్రిములు, దోమలకు ఆవాసంగా మారుతున్నది. ఎల్లారెడ్డిగూడ అమీర్‌పేట లా కాలేజీ లైన్‌లోని రేడియంట్ స్కూల్ వద్ద ఉన్న పెద్ద నాలాకు రెండు మ్యాన్‌హోల్స్ బిగించాల్సి ఉన్నది. ఇప్పటికీ పనులు చేయకపోవడంతో వర్షం పడినప్పుడు మురుగు రోడ్డుపై పొంగుతున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల సమన్వయ లోపంతోనే పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
అసమర్థ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.. వీధులన్నీ చెత్తాచెదారంతో కంపుకొడుతున్నాయి’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర మున్సిపల్, ఆరోగ్యశాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పాలనలో వానకాలానికి రెండు నెలల ముందుగానే అప్రమత్తమై సీజనల్ వ్యాధులు, పారిశుధ్య సమస్యలపై మున్సిపల్, జీహెచ్ఎంసీ, వైద్యారోగ్యశాఖలు సమీక్ష, సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టేవారమని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారుకు ముందుచూపు కరువవ్వడంతో ఇలాంటి పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే సర్కారు పెద్దలు మాత్రం ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లలో మునిగితేలుతున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రజారోగ్యం, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.