హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో బుధవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ను పాటించకపోవడంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణరావు నోటీసులు జారీచేశారు. సోమవారం వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ఇచ్చే వివరణ ఆధారంగా ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటికే సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఆదేశాలు అమలు చేయనందుకు వారంట్ జారీచేస్తూ తదుపరి విచారణలో స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కలెక్టరేట్లలో ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే కలెక్టర్ సందీప్‌కుమార్ సమయానికి అక్కడికి రాకపోవడం వివాదాస్పదమైంది.
జాతీయ జెండా ఆవిష్కరణ పూర్తయిన తర్వాత ఆయన తాపీగా వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలస్యంగా రావడంపై స్టేజీపైనే ప్రశ్నించారు. గతంలో ఆగస్టు 15న సైతం ఇదే విధంగా వ్యవహరించడం గమనార్హం. ఇది తీవ్ర అవమానంగా భావించిన విప్ ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘన, అవమానించడంపై ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కలెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.
ఇప్పటికే సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను, స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేలా కలెక్టర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు నోరు మెదపలేదు. పైగా ఆయనను ప్రోత్సహించేలా వ్యవహరించడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన అలుసుతో ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే లెక్కచేయకుండా అవమానించే స్థాయికి చేరుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన వరకు వస్తే గానీ తెలియదన్నట్టుగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్‌ను అవమానిస్తే గానీ తెలిసిరాలేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.