హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ఐదు సబ్ కమిటీలు వేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వొకేషనల్ విద్య, అన్నింటిని అనుసంధానం చేయడం- ఆర్థిక వనరుల సమీకరణ.. ఇలా ఐదు సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మళ్లీ ఒక్కో సబ్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశమై.. పాలసీ రూపొందించాలన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నాయి.
సిలబస్, కరిక్యులం మార్పు లు, భాషానైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ సబ్ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. అక్టోబర్ 30 కల్లా పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే, డిసెంబర్లో ఈ పాలసీలను విడుదల చేయాలన్న ఆలోచనలో సర్కారు వర్గాలున్నాయి.