హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒకరికీ చేరేలా సభా కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం జరిగిన షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు, మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమ కమిటీల సమావేశానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాసన వ్యవస్థలో కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. షెడ్యూల్డ్ తెగలో అర్హులైన కొందరికి సబ్సిడీ పథకాలు అందకపోవడంతో అందుకు సంబంధించిన పేపర్లను పట్టుకొని తిరుగుతున్నారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ ఛైర్మన్, సభ్యులపైన ఉన్నదని పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారిధిగా కమిటీలు పనిచేయాలని సూచించారు. షెడ్యూల్డ్ తెగల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయడం కమిటీ ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు. వెనుకబడిన తరగతులు, మహిళా, శిశు, వృద్ధుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ శాసనమండలి సంయుక్త కమిటీలు అత్యంత ప్రభావితమైనవని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కమిటీల సూచనలు, సలహాలు ఉపయోగపడుతాయని చెప్పారు.