న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ‘ఏడో శతాబ్దం తర్వాత శత్రుదేశాల నుంచి జరిగిన దాడులను ప్రతిఘటించడానికి పలువురు రాజులు, రాజకుమారులకు కాళి, దుర్గా, భవానీ వంటి దేవతలు ఖడ్గాలు బహుమతిగా ఇచ్చేవారు’ అంటూ మంగళవారం ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. ‘ప్రతిఘటన-దృఢత్వం పేరున ఉన్న ఒక చాప్టర్లో అండర్స్టాండింగ్ సొసైటీ ఇండియా, బియాండ్-పార్ట్ 2లో ఏడో శతాబ్దం నుంచి భారత ఉపఖండంపై జరిగిన దాడుల గురించి వివరించింది. ‘బస్తర్‌ను పాలించే అన్నమరాజకు మాణిక్యదేవి (దంతేశ్వరి) నుంచి ఖడ్గం వచ్చినట్టు సమాచారం. సుల్తాన్లపై మదురైలో పోరాటం చేయడానికి కుమార కంపన (విజయనగర) రాజు దేవత ఇచ్చిన ఖడ్గంతోనే యుద్ధంలో పాల్గొన్నారు.
అదేవిధంగా శివాజీ మహరాజ్ కూడా తుల్జాభవానీ నుంచి ఖడ్గం స్వీకరించినట్టు సంప్రదాయంగా విశ్వసిస్తారు’ అని ఆ చాప్టర్లో పేర్కొన్నారు. రాజులు దేవతలను ఆరాధించడం అన్నది సుదీర్ఘ సంప్రదాయంగా ఉన్నట్టు ఆ అధ్యాయం మతపరమైన సంప్రదాయాల గురించి వివరించింది. ఏడవ శతాబ్దం నుంచి ఈ ఉపఖండం మతపరమైన ఉద్దేశాలతో వరుస దాడులకు గురైనట్టు పేర్కొంది. అరబ్, టర్కీష్, మొఘల్, యూరోపియన్ శక్తులకు వ్యతిరేకంగా భారతీయ పాలకులు ఎప్పుడు, ఎలా ప్రతిఘటించారో అందులో ప్రస్తావించారు. కాగా, విమర్శనాత్మక పరిశోధనను ప్రోత్సహించడమే లక్ష్యంగా మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్ర్తాన్ని అభివృద్ధి చేసినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సక్లానీ పేర్కొన్నారు.