బ్యాంకాక్: భారీ వర్షాలతో బ్యాంకాక్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వరద నీటిలోనే స్థానికులు తమ రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు వినూత్నంగా తేలియాడే మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ సమీపంలో నీట మునిగిన వీధిలో చిన్న పడవలు, తేలియాడే వేదికలు, ఫోమ్ బాక్స్‌లపై చేపలు, కూరగాయలు మొదలైనవాటిని విక్రయిస్తున్నారు. వరదనీటిలో కొందరు నడుచుకుంటూ మార్కెట్‌కు చేరుకుంటుండగా, మరికొందరు చిన్న పడవలు, తెప్పల సాయంతో తాత్కాలిక దుకాణాల వద్దకు వెళ్లి, వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.
బ్యాంకాక్‌లోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడంతో శనివారం నగరాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. బ్యాంకాక్‌లోని వరద నీరు పూర్తిగా తొలగిపోవడానికి రెండు నుంచి మూడు రోజులు పట్టవచ్చని మంగళవారం థాయ్ ప్రభుత్వం తెలిపింది. గతవారంలో రెండు మూడు రోజుల వ్యవధిలో బ్యాంకాక్‌లో సుమారు 320 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.