KRMB | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇప్పుడు డైలమాలో పడిపోయింది. ఇప్పుడేం చేయాలి? అనేదానిపై తర్జనభర్జనలు పడుతున్నది. కేంద్రజల్‌శక్తి శాఖ ఈ నెల 17న ఇరు రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, వాటికి సంబంధించిన 15 ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించింది. అందుకు రెండు రాష్ర్టాలు అంగీకరించాయని ఇటీవల విడుదల చేసిన మినిట్స్‌లో కేంద్రజల్‌శక్తిశాఖ స్పష్టంగా తెలిపింది.
ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణకు తీవ్ర నష్టమని, కాంగ్రెస్ సర్కారు నిర్ణయంపై తెలంగాణవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ సర్కారు చెప్తున్నది. కానీ, ఇప్పుడేం చేయాలి? అన్నదానిపై తర్జనభర్జనలు పడుతున్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్ర జల్‌శక్తిశాఖకు లేఖ రాసేందుకు సిద్ధమైందని తెలుస్తున్నది.
ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అదీగాక ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వెల్లడించిన అభిప్రాయాలను సరిగా నమోదు చేయలేదని, వాటిని మినిట్స్‌లో పొందుపరచాలని కోరాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సమావేశ ఎజెండాలో ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్ అంశాన్ని పొందుపరిచినా దానిపై చర్చించలేదని తెలంగాణ సర్కారు వాదిస్తున్నది.
ఆపరేషన్ ప్రొటోకాల్ లేకుండా, తెలంగాణ గతంలో లేవనెత్తిన 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం, క్యారీఓవర్ స్టోరేజీ తదితర అంశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ, అవన్నీ పూర్తయితే కానీ ప్రాజెక్టులను అప్పగించబోమనే అంశాన్ని కేంద్రానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా లేఖను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించగా, వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే కేంద్ర జల్‌శక్తిశాఖ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల స్వాధీనానికి కేఆర్ఎంబీ సైతం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఆపరేషన్ ప్రొటోకాల్‌పై సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.