రాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ): నేత కార్మికులకు పనిలేక కుటుంబ పోషణ భారమవుతున్నదని, ప్రభుత్వం స్పందించి నేతన్నలకు ఉపాధి కల్పించాలని ఓ నేత కార్మికుడు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని నేతన్న విగ్రహంపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపాడు. వరంగల్ జిల్లాకు చెందిన పాము ప్రభాకర్ 25 ఏండ్ల క్రితం కుటుంబంతో కలిసి సిరిసిల్లకు వలస వచ్చి నేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మరమగ్గాలు మూత పడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబాలను పోషించలేక కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పనిలేక కుటుంబ సభ్యులకు తిండికి గోసపడుతున్నామంటూ ప్రభాకర్ ఆవేదన వ్యక్తంచేశాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు కలుగజేసుకుని ప్రభాకర్‌కు నచ్చజెప్పి కిందికి దింపారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు పనిలేకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, అడ్డమీద కూలికి పోదామన్నా.. ఆ పని కూడా దొరకడం లేదని, భార్యాపిల్లలకు కడుపునిండా అన్నం పెట్టలేని తనకు.. ఈ బతుకెందుకంటూ కంటతడిపెట్టాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల వల్ల చేతి నిండా పనితో పదేండ్లు మంచిగ బతికినమని తెలిపాడు.
నెలకు రూ.20 వేలు సంపాదించేవాడినని, కాంగ్రెస్ సర్కారు వచ్చినంక ఆర్డర్లు ఇవ్వకపోవడం, పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల సేట్లు సాంచాలు బంద్పెట్టారని, రెండు నెలలుగా పనిలేక రోడ్డుపైన తిరుగుతున్నానని వాపోయాడు. ఇప్పటికే తోటి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పనికల్పించి ఆదుకోవాలని, తమకేదైనా జరిగితే బాధ్యత సర్కారుదేనని చెప్పాడు.