కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టి పరస్పర విభేదాలు సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని టీఎన్జీవోల సంఘం, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులను కేవలం పనిముట్లుగా చూడటం, ఉద్యోగ సంఘాల్లో విభజన రాజకీయాలు ఉపయోగించడం ప్రభుత్వానికి తగదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఘాటుగా హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల సంఘం కార్యాలయంలో శుక్రవారం సంఘం పూర్వ అధ్యక్షుడు బంగారు స్వామినాథన్ విగ్రహాన్ని సంఘం రాష్ఱ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణిని ఘనంగా సత్కరించారు.
ఆ తర్వాత జరిగిన సంఘం కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం.. ఒకే ఉద్యోగ సంఘానికి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆ సంఘానికే వత్తాసు పలుకుతున్నదని మండిపడ్డారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో అయోమయం నెలకొన్నదని, అసంతృప్తి పెరిగి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సును కాపాడటమే ఉద్యోగ సంఘాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ సమానంగా గౌరవించి వారి సం క్షేమం కోసం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు. ఉద్యోగ సంఘా ల మధ్య విభేదాలను రెచ్చగొట్టి టీఎన్జీవోల సంఘాన్ని పక్కన పెట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమమే
ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ వేదికగా ఉద్యోగ సంఘాలన్నింటినీ సమన్వయంచేసి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తామని, ఉద్యోగుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగితే తాము ముందుండి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, నెలకు రూ.1,500 కోట్లు విడుదల చేస్తూ అత్యవసర బిల్లుల చెల్లింపునకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు, జీపీఎఫ్ సహా అన్నిరకాల బిల్లులను సత్వరమే విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ తక్షణమే జీవో విడుదల చేయాలని, చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను ఈ నెలలోనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి అన్ని బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, కేంద్ర సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.