హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ) : జాతీయ ఉపాధిహామీ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే సోషల్ ఆడిట్ డైరెక్టర్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. తెలంగాణ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫరెన్సీ డైరెక్టర్‌ను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు చర్యలు చేపట్టింది. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించింది. శనివారంతో గడువు ముగియగా 56 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హత గల అభ్యర్థిని ఎంపిక చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. వచ్చే నెల 15న భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల ఏఎన్ఎంలను రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు కే యాదనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం అన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక రాకుండానే పరీక్ష తేదీ ప్రకటించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 6,500 మంది ఏఎన్ఎంలకు పరీక్షలో 50 మార్కుల వెయిటేజీ ఇవ్వాలని, సమానపనికి సమాన వేతనం, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి పనిభారం తగ్గించాలని కోరారు.