Backlog Posts | హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్‌లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) ముమ్మర కసర త్తు చేస్తున్నది. డౌన్మెరిట్ కోసం ఎదురుచూస్తున్న 1:2 అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం, రాజకీయ స్వార్థం వల్లనే వేలాది పోస్టులు మిగిలిపోయే దుస్థితి ఏర్పడిందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు మండి పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మై నార్టీ, బీసీ గురుకులాల్లో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ తదితర 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ గతేడాది ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించింది. కోర్టు కేసులు, అర్హులు లేని పోస్టులను మినహాయిం చి 8,304 పోస్టులకు తుది జాబితా ప్రకటించగా, ఆయా సొసైటీలు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్స్ సైతం ఇచ్చాయి. నెల గడుస్తున్నా పోస్టింగ్ ఆర్డర్ అం దుకున్న వారిలో 1,700 మంది అభ్యర్థులు ఇప్పటికీ జాయిన్ కాలేదని తెలుస్తున్నది. ఇప్పటికే 2,104 పోస్టులు మిగిలిపోయాయి.
గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులే చాలా మంది టీజీపీఎస్పీ నిర్వహించిన జేఎల్ పోస్టులను సాధించారు. ప్రస్తుతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతున్నది. గురుకులాల్లో పోస్టింగ్ ఆర్డర్స్‌ను తీసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ రిజల్ట్ కోసమే ఎదురుచూస్తూ జాయిన్కాకుండా ఉన్నారని తెలుస్తుంది. దీంతో గురుకుల పోస్టుల్లో చాలా మేరకు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు 11,062 డీఎస్సీ పో స్టులను ప్రకటించడంతో ఆ పరీక్షకు సైతం గు రుకుల పోస్టులకు ఎంపికైన వారే పోటీపడ్డారు.