హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2008 బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా 2008 డీఎస్సీలో నష్టపోయిన 1382 మందికి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా (ఎస్జీటీ) కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి విద్యాసంవత్సరం చివరి రోజు వరకు వీరి సేవలు వినియోగించుకోనున్నట్టు వెల్లడించారు. వేతనం రూ.31,040 చెల్లించనున్నట్టు తెలిపారు. నిరుడు అక్టోబర్‌లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్‌ను తయారు చేశామని తెలిపారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి, నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
2008లో నాటి ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆతర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30% డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారమే ఫలితాలు విడుదల చేసి.. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, 30% కోటా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రభుత్వం డీఈడీ అభ్యర్థులకు 30% పోస్టులు కేటాయించి కౌన్సెలింగ్ నిర్వహించింది. దీంతో కామన్మెరిట్ లిస్ట్‌లో ఉండి, 30% కోటా వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి 14 ఏండ్లు కోర్టులు, ప్రభుత్వాల చుట్టూ తిరిగారు. బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.