హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): మూసీ వెంబడి రెండో దఫా కూల్చివేతలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రివర్ బెడ్ పరిధిలోని నిర్మాణాలు, కట్టడాలు, భవనాలను నేలమట్టం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశమైంది. ఇటీవల జరిగిన ఈ సమావేశంలో రివర్ బెడ్ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన దాదాపు 2,100 నిర్మాణాలను నెలాఖరులోగా కూల్చివేయాలని ఆదేశించింది. దశల వారీగా కూల్చివేతలు జరుగుతుండగా దీపావళి తర్వాత మూడో దఫా ఆక్రమణలు, నిర్మాణాల గుర్తింపు, కూల్చివేతలకు కసరత్తు మొదలు అవుతుందని తెలిసింది. జిల్లాల వారీగా సేకరించిన సోషియో ఎకానమిక్ సర్వే, ముందుగానే గుర్తించిన రివర్ బెడ్ మ్యాపుల ఆధారంగా నిర్మాణాలను మూసీలో కలపనున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో 2,100 కంటే ఎక్కువగానే నిర్మాణాలు ఉన్నట్టు రెవెన్యూ, ఇరిగేషన్ మ్యాపుల ద్వారా తెలిసింది. కూల్చివేతలపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే సమన్వయ సమావేశం నిర్వహించినట్టుగా ఎంఆర్డీసీఎల్ వర్గాలు తెలిపాయి. రివర్ బెడ్ నిర్మాణాలు కూల్చివేతలు పూర్తి కాగానే, ఎఫ్ఆర్ఎల్ పరిధిలోని నిర్మాణాలపై చర్యలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలతో కూల్చివేతలకు ఆటంకం లేకుండా తగిన ఆధారాలు సమకూర్చుకోవాలని సూచించారు.