హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): పాత అసెంబ్లీ భవనంలో శాసనమండలి సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరేలా లేదు. అది పురావస్తు భవనం కావడంతో పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మండలి కొనసాగుతున్న జూబ్లీహాల్‌ను పార్లమెంటు సెంట్రల్ హాలు తరహాలో సెంట్రల్ హాలుగా వినియోగించాలని, పాత శాసనసభ భవనంలో మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎల్పీ, ఇతర ఫ్లోర్ లీడర్ల కార్యాలయాలను కూల్చివేసి అసెంబ్లీ ప్రాంగణానికి చివర్లో నిర్మించేందుకు, పబ్లిక్ గార్డెన్ నుంచి లలితా కళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఒక ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి అందరికీ కనిపించే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రూ.50కోట్ల అంచనాతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.ఈ భవనం పురావస్తు నిర్మాణం కావడంతో పునరుద్ధరణ పనులు హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. సిమెంటు వాడకుండా సున్నంతో పనులు నిర్వహిస్తున్నందున, పునరుద్ధరణ పనులకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో వచ్చే మండలి సమావేశాలు కూడా యథావిధిగా జూబ్లీహాల్లోనే కొనసాగనున్నాయి.