హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : మంత్రివర్గ సమావేశాన్ని రేపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో రైతుభరోసా, యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఐఏఎస్ బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు అంశాలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం వాటిని నెరవేరుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇప్పటికే ఐదు డీఏలో పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం ఒక్క డీఏకైనా మోక్షం లభిస్తుందనే ఆశ ఉద్యోగుల్లో ఉంది. వానకాలం సీజన్ రావడంతో పంటల సాగు మొదలైంది.
దీంతో రైతులు రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ రైతుభరోసా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా రూ. 4వేల కోట్ల బకాయి ఉంది. దీనికి తోడు ఇప్పుడు వానకాలం సీజన్‌కు మరో రూ. 9,200 కోట్లు కావాలి. అంటే రైతుభరోసా కోసం సుమారు రూ.13,200 కోట్లు అవసరం. ఈ మొత్తానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా అనేది చూడాలి. ఇప్పటికే యువ వికాసానికి సంబంధించి అర్హుల జాబితాను సిద్ధం చేయడంతో ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపి అమలు చేస్తారా? వాయిదా వేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.