హైదరాబాద్, మార్చి 18 ( నమస్తే తెలంగాణ ) : రైతు సమస్యలు చర్చకొస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అందులో భాగంగానే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన తాము సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక శాసనసభ సాక్షిగా రేవంత్‌రెడ్డి సర్కార్ పారిపోయిందని ఎద్దేవాచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో హరీశ్‌రావు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతిపక్షం గొంతునొక్కి ప్రజాసమస్యలను పరిష్కరించకుండా ఉండటమే ప్రభుత్వ విధానంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరి సరి కాదని స్పీకర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, అసెంబ్లీ కార్యదర్శికి తమ అభ్యంతరాన్ని, అభిప్రాయాన్ని చెప్పామని తెలిపారు. ప్రశ్నోత్తరాలను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలనే రద్దు చేయటం ఏమిటని ప్రశ్నించారు. సమావేశాల్లో జీరో అవర్ పెట్టినా పెట్టకపోయినా తప్పసరిగా ప్రశ్నోత్తరాలు పెట్టాల్సిందేనని స్పష్టంచేశారు.
ఫ్రభుత్వం రూ.50 వేల కోట్ల భూమి తాకట్టు బాగోతం వెలుగులోకి వస్తుందనే ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను రద్దు చేసిందని హరీశ్ దుయ్యబట్టారు. హెచ్ఎండీఏ భూములు తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్లు, టీజీఐఐసీకి చెందిన భూముల నుంచి రూ.10 వేల కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ భూముల నుంచి రూ.10 వేల కోట్లు, జీహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు ఇలా మొత్తం రూ.50 వేల కోట్ల విలువైన భూమి, ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. దీనిపై ప్రశ్నోత్తరాల్లో కేటీఆర్ ప్రశ్న జాబితాలో ఉన్నదని, సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే ప్రభుత్వం దాటవేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెబ్సైట్లల్లో పెట్టడం లేదని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోవటానికి ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని హరీశ్ మండిపడ్డారు. ‘ఈ యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఎందుకు విడుదల చేయటం లేదు’ అనే కేటీఆర్ ప్రశ్న ఉన్నదని, దీనిపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం చెప్పకుండా పారిపోయిందని ఎద్దేవాచేశారు. పంటలు ఎండిపోడానికి తమదే బాధ్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంగీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ పంటలెండిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల కింద లక్షా 50 వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ప్రభుత్వం 33 రోజులపాటు పంప్‌లు ఆన్ చేయకపోవటమే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాదులతోపాటు మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీళ్లున్నా విడుదల చేయకపోవడం వల్ల దుబ్బాక నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని హరీశ్ తెలిపారు. వానాకాలం, యాసంగి పంటకాలాల్లో రైతుభరోసాపై ప్రభుత్వం దాటవేస్తున్నదని చెప్పారు.రుణమాఫీ పూర్తయిందని సీఎం, మంత్రులు పదేపదే చెప్తున్నారని, వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా కనీసం 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. సిద్దిపేటలో మొత్తం 43,363 మంది రైతులుంటే వారిలో 22,949 మంది రైతులకే రుణమాఫీ అయ్యిందని, 20,514 మంది రైతులకు మాఫీ కాలేదని వివరించారు. రైతుభరోసా రూ. 39 కోట్లు మాత్రమే రైతులకు చేరిందని, ఇంకా రూ. 37 కోట్లు వేయలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ కారణంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు జీతం కావాల్నంటే రోడ్కెక్కాల్సిందేనా? అని హరీశ్ ప్రశ్నించారు. నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది వేతనాలపై మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డెక్కే దుస్థితికి నెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో అంకితభావంతో దవాఖానలో రాత్రింబవళ్లు సేవలందిస్తున్న సిబ్బంది ప్రతి నెలా జీతాల కోసం చేతులు జోడించి అడగాల్సి వస్తున్నదని, రోడ్డెక్కి పోరాటం చేస్తే తప్పా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని చెప్పారు. ఉద్యోగుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తియ్యటి మాటలు, ఇప్పుడేమో తీవ్ర నిర్లక్ష్యం కాంగ్రెస్ మోసపూరిత పాలనకు నిదర్శనమని విమర్శించారు. కష్టజీవుల న్యాయమైన హక్కులను కాలరాస్తూ, వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమా? అని ప్రశ్నించారు. నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు వెంటనే విడుదల చేయాలని, మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చెయ్యకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హయాంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసిందని వివరించారు. ‘మేము 54 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటివరకు 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది’ అని వివరించారు.
రైతు సమస్యలపై సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. నీళ్లులేక పంటలు ఎండుతున్నాయన్నారు. ఆందోళన చెందుతున్న రైతులు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తే వారికి నిరాశే ఎదురైందని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యతోపాటు రైతుభరోసా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు వంటి ముఖ్యమైన రైతు సమస్యలపై తాము ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వం దృష్టికి తెద్దామని సిద్ధమయ్యామని వివరించారు. తనతోపాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి సభ దృష్టికి తెచ్చి తద్వారా సమాధానం వస్తుందని ఆశిస్తే వాటికి సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పారిపోయిందన్నారు.