రవీంద్రభారతి, జూన్10: గిరిజన లంబాడీలకు మంత్రి పదవులు ఇవ్వకుండామోసం చేసిన కాంగ్రెస్ పార్టీ హఠావో.. బంజారా బచావో నినాదంతో భవిష్యత్తు కార్యక్రమాలు చేపడుతామని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక జనా భా ఉన్న లంబాడీ సామాజికవర్గాన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మండిపడ్డారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ..
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో లంబాడీ సామాజికవర్గానికి కుట్రపూరితంగా స్థానంలేకుండా చేశారని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రలో లంబాడీలు ఏ విధంగా వంచనకు గురయ్యారో.. ఇప్పుడు అదేవిధంగా మోసపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై లంబాడీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలని ఆయన కోరారు. లంబాడీలకు మంత్రి పదవి భిక్ష కాదని.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టంచేశారు. బంజారాలు, రైతులను జైల్లో పెడుతున్న రేవంత్‌రెడ్డికి బంజారాల నుంచి ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.