Metro Train | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : గత కొంతకాలంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో రైలు నిర్మించాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో కీలకమైన డీపీఆర్ తయారు చేయాలంటూ హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫేజ్-2 మెట్రో విస్తరణలో భాగంగా పార్ట్-బీలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట (22 కిలోమీటర్లు), ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కి.మీ) వరకు రెండువైపులా కలిపి 45 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తొలుత నార్త్‌సిటీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఫేజ్-2 డీపీఆర్‌ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. దీంతో తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నార్త్‌సిటీ ప్రాంతవాసులు పోరుబాటపట్టారు.
దీంతో వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఫేజ్-2 పార్ట్-బీగా ఈ రెండు మార్గాలను చేర్చాలంటూ తాజాగా సూచించింది. హైదరాబాద్ నగరంలో రెండో దశ విస్తరణలో భాగంగా మొత్తంగా 162 కిలోమీటర్ల మేర మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే ఫేజ్-2 పార్ట్-ఏలో 76 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ సిద్ధం కాగా, పార్ట్-బీలో భాగంగా ఫోర్త్ సిటీ, ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట ప్రాంతాలను కలుపుతూ డీపీఆర్‌ను సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.318 కోట్లు ఖర్చు అవుతుండగా… తాజా ప్రతిపాదనల నేపథ్యంలో అంచనా వ్యయం మరో రూ.14 వేల కోట్లు దాటే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టును కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్మించనున్నారు.
మొత్తానికి నార్త్‌సిటీలో ముఖ్యమైన మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రోరైలు మార్గం నిర్మించనుండటంతో ఆ ప్రాంతంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రధాన ఐటీ కేంద్రమైన వెస్ట్ హైదరాబాద్ తరహాలో నార్త్సిటీని అభివృద్ధి చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కుత్బుల్లాపూర్ కేంద్రంగా ఐటీపార్క్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. అటు జేబీఎస్ నుంచి జీనోమ్‌వ్యాలీ వరకు, ఇటు ప్యారడైజ్ నుంచి డైరీఫాం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కేసీఆర్ హయాంలోనే ప్రతిపాదించింది. ఇందుకు అవసరమైన భూములను రక్షణ శాఖ నుంచి తీసుకునేందుకు అప్పట్లోనే చొరవ చూపిన విషయం తెలిసిందే.
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా నార్త్ సిటీ మెట్రో రైలు నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఫేజ్-2 పార్ట్-బీ కింద డీపీఆర్‌ను మూడు నెలల్లో సిద్ధం చేస్తాం. రెండు మార్గాల్లో 45 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా రూపొందించేలా ప్రణాళికలు ఉండాలని, ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని సీఎం సూచించారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలును విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
నార్త్‌సిటీ మెట్రో ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రో నిర్మించాలని ఏడాది కాలంగా ఉద్యమించాం. ఇంటింటికీ మెట్రో సాధన డిమాండ్‌ను తీసుకెళ్లేలా, నార్త్‌సిటీలో ఉన్న 30 లక్షల మంది చిరకాల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాం. స్థానిక నేతల నుంచి ప్రధాని మోదీ వరకు నార్త్‌సిటీ మెట్రో సాధన ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖలు అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం నార్త్‌సిటీ మెట్రోనూ ఫేజ్-2లోనే నిర్మించాలని నిర్ణయించడంతో ఆధునాతన రవాణా సౌకర్యం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానున్నది. కేవలం డీపీఆర్ రూపొందించి విడిచి పెట్టకుండా, యుద్ధప్రాతిపదికన ఫేజ్-2 మొత్తం పనులు చేపట్టేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈ ప్రజా ఉద్యమంలో సహకరించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ప్రజాసంఘాలు, కమ్యూనిటీ సొసైటీలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు.
నార్త్‌సిటీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో ప్రజల చిరకాల కల సాకారమైంది. ఏడాది కాలంగా తమ ప్రాంతానికి మెట్రో రైలు నిర్మించాలంటూ సాగిన ప్రజా పోరాటానికి సీఎం స్పందించారు. నార్త్‌సిటీకి మెట్రో నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. కేసీఆర్ హయాంలో నార్త్‌సిటీకి మెట్రో నిర్మించాలనే ప్రతిపాదనలను రేవంత్‌రెడ్డి పరిగణనలోకి తీసుకుని నిర్మాణానికి చర్యలు చేపట్టారు.