హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ)కి అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీలో ఏఐ కార్యకలాపాల కోసం 200 ఎకరాలను కేటాయించిందని చెప్పారు. హెచ్ఐసీసీలో గురువారం రాష్ట్ర ఐటీ శాఖ నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీలతో సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని అన్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సైతం కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం ఏఐ కార్యకలాపాల కోసం ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, విద్య, ప్రజా రవాణా వ్యవస్థల్లో ఏఐ వినియోగంపై ఇండస్ట్రీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యే వరకు శంషాబాద్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో కూడి కార్యాలయ స్థలాన్ని ఏఐ ఆధారిత కంపెనీల కోసం అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వివిధ సంస్థలతో 26 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రెండ్రోజులు జరిగే సదస్సులో 50కి పైగా స్టార్టప్‌లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.