హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందని జీవో-46 బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని, గెలిచాక నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఈ మేరకు బాధితులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టులో వాదనలకు తీవ్ర అడ్డంకులు సృష్టించి ఆర్థికంగా, మానసికంగా తమను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు.
కేసును ముందుకు సాగకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. చందాలు వేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్తే అకడ కూడా న్యాయం జరగకుండా అడ్డుపడుతూ గ్రామీణ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపి, ఈ నెల 25న ఫైనల్ హియరింగ్‌కు సహకరించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే 1,055 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని, తమకు న్యాయం చేయకపోతే స్థానిక ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో బాధితులు ఆకాశ్, శంకర్, కల్యాణ్, నవీన్, సూరి, రాజ్‌కుమార్, చెర్రీ, ప్రవీణ్ ఉన్నారు.