హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం ఈ నెల 4న విడుదల చేసిన జీవో 21 తుది నిర్ణయం కాదని తేలిపోయింది. ఆ జీవోలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. జీవోపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడంతో సర్కారు ఇరకాటంలో పడింది. అభ్యర్థులతోపాటు కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతోపాటు పీహెచ్డీ స్కాలర్లు ఒక్కసారిగా సర్కారుపై వ్యతిరేకగళం ఎత్తారు. గత నాలుగు రోజుల్లో ఓయూ, కేయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. చివరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
జీవో 21లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నదని కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీకోసం ఇక కామన్ రిక్రూట్మెంట్ బోర్డుతో కాకుండా, యూజీసీ నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తిచేస్తామని ఆయన చెప్తున్నారు. జీవో 21తో సంబంధం లేకుండా తమ పోస్టులను క్రమబద్ధీకరించాలని వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమను కనీసం కాంట్రాక్టు అధ్యాపకులుగా గుర్తించాలని పార్ట్‌టైం అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు వారంతా ఆందోళనబాట పట్టారు. రాష్ట్రంలో పీహెచ్డీ పూర్తిచేసిన వారికి అధ్యాపకుల నియామకాల్లో ఇచ్చిన 10 మార్కుల వెయిటేజీ కాకుండా, 30 మార్కులకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.