Telangana | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : “మన పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పియ్యండి, ప్రిపేర్ చేయండి, ఏం కావాల్నో సమకూర్చండి, బ్యాక్‌ల్యాగ్ పోస్టులెందుకుండాలి? ఫారిన్ పంపించేందుకు ఏర్పాట్లు చేయండి” ఇది బుధవారం అసెంబ్లీలో తనతో సమావేశమైన మాదిగ సమాజికవర్గం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు. సీఎం మాటలు ఇలా ఉంటే.. బడ్జెట్ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలను ఎలా భర్తీచేస్తారని నిరుద్యోగుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత, 2 లక్షల ఉద్యోగాలు. నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సర్కారు కొలువుల భర్తీ విషయంలో ఆఖరుకు రిక్తహస్తమే మిగిలిచ్చిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడున్న ఉద్యోగులకే జీతాలివ్వలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ వేదికలపై చేతులెత్తేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకురానిదే జీతాలివ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కొత్త ఉద్యోగాల భర్తీకి బడ్జెట్లో నయాపైసా కేటాయించలేదు. కొత్త ఉద్యోగాల భర్తీకి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో వీటి ప్రస్తావనే చేయలేదు. అంటే కొత్త కొలువుల భర్తీ కథ కంచికి చేరినట్లేనని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కొత్త ఉద్యోగాల భర్తీని పూర్తిగా పక్కనపెట్టేశారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ 15 నెలల పాలన కాలంలో 57, 946 ఉద్యోగాలను భర్తీచేసినట్టు ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో తెలిపింది. వాటిలో కేసీఆర్ హయాంలో చేపట్టినవే దాదాపు 45 వేల ఉద్యోగాలున్నాయి. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని కాంగ్రెస్ ఎన్నికల వేల హామీనిచ్చింది. అంటే ఇప్పటివరకు ఇచ్చిన 57వేల ఉద్యోగాలను తీసేస్తే, 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 1.43లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ రానున్న ఆర్థిక సంవత్సరంలో 30వేల పోస్టులు భర్తీచేస్తామని బడ్జెట్లో సర్కారు ప్రకటించింది. ఇవి కూడా విలేజ్ లెవల్ ఆఫీసర్ (వీఎల్వో), వీఆర్వో, అంగన్వాడీల్లోని ఉద్యోగాలే. అంగన్వాడీల్లో 14,236 ఉద్యోగాలు, వీఎల్వో, వీఆర్వో ఉద్యోగాలు మరో 15వేల వరకు భర్తీచేయనున్నట్టు సమాచారం. గతంలో అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెంబర్ బోగస్ క్యాలెండర్ అని, కాంగ్రెస్ నయవంచక కాంగ్రెస్ అని నిరుద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఉద్యోగాల భర్తీపై గొప్పలు చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి మాటలు చెప్తున్నప్పటికీ వాస్తవంగా లెక్కలు చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగం భర్తీచేస్తే ఇచ్చే సగటు వేతనం రూ.30వేలు అనుకుంటే ఏడాదికి సర్కారు రూ. 3.6లక్షలు వేతనం రూపంలో అందించాలి. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తే ఏడాదికి రూ.7,200కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. కానీ రూ. 7,200 కోట్లను జీతాల కోసం ప్రభుత్వం కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో అర్థం చేసుకోవచ్చని నిరుద్యోగులు చెప్తున్నారు.
బడ్జెట్లో ప్రవచనాలు ఎకువ.. పైసలు తకువ ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం దివాలా తీసిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, అదంతా అబద్ధమని చెప్పారు. కేసీఆర్ 4 లక్షల 37 వేల కోట్ల అప్పు చేసినట్టు బడ్జెట్లో చెప్పారని.. సీఎం, కాంగ్రెస్ నేతలు రూ.7 లక్షల కోట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలన్నీ అవాస్తవాలేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల మీద హడావుడి చేశారని, బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసే లేదని తెలిపారు. ఇది దివాలాకోరు, దగాకోరు బడ్జెట్‌గా అభివర్ణించారు. సర్కార్ ఏ ఒక్క గ్యారెంటీని అమలుచేయలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అరకొర కేటాయింపులతో ప్రజలను వంచించిందని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి అనేక సభల్లో ఊదరగొట్టారే తప్పా, ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఈ బడ్జెట్ చేతగాని పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసేలా ఉన్నదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను వంచించేలా ఉన్నదని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఉద్యోగాల నియామకం హామీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. బడ్జెట్లో 420 హామీల అమలుపై మాట్లాడలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని ఎమ్మెల్సీ కోటిరెడ్డి విమర్శించారు. హామీలను అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి పనుల కోసం పైసా కేటాయించలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్లో కేటాయింపులు ఎన్నికల హామీలను నెరవేర్చేలా లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. భూముల విక్రయం, మద్యం ద్వారా నిధులు సమీకరించాలని భావించడం సమంజసం కాదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు పొంతన లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపులు తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.
బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధరంగాల ఉత్పత్తి, ఉత్పాదకతలతోపాటు ఉద్యానరంగ అభివృద్ధికి కేటాయింపులు జరగలేదని తెలంగాణ రైతు సంఘం ఆరోపించింది. ఈ బడ్జెట్‌ను చూస్తే రుణమాఫీ కాని రైతులకు ఇక మాఫీ అయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తున్నదని పేర్కొంది.
బడ్జెట్లో పెన్షనర్లు, ఉద్యోగుస్తుల ఊసే లేకపోవడం శోచనీయమని పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రాజేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి ఎంవీ నరసింగరావు, ఆర్థిక కార్యదర్శి బీ నర్సయ్య ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. పెన్షనర్ల గురించి ఒక్కమాట మాట్లడకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు.