హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(నమస్తే తెలంగాణ): కొత్త డిస్కమ్ ఏర్పాటు రెండు కంపెనీల మధ్య పంచాయితీకి కారణమైంది. మూడవ డిస్కమ్‌గా టీజీఆర్పీడీసీఎల్ (రైతు డిస్కమ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, సీఎండీగా ముషారఫ్ ఫరూఖీని నియమించినప్పటికీ, దీని పాలనా వ్యవహారాలు, ఇతర విభాగాలను ఎక్కడి నుంచి నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతు డిస్కమ్‌లోకి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఎక్కడ పనిచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు పాత చాంబర్లలోనే తమ విధులు కొనసాగిస్తుండగా, వారికి టీజీఎస్పీడీసీఎల్ సిబ్బందితో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లకుండా మధ్యలో ఉన్న ఒకరిద్దరు డైరెక్టర్లు మేనేజ్ చేస్తున్నారంటూ దక్షిణ డిస్కమ్‌లో చర్చ జరుగుతున్నది.
దక్షిణ డిస్కమ్ వర్సెస్ రైతు డిస్కమ్‌గా ప్రస్తుతం మింట్ కాంపౌండ్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగుల వ్యవహారం కొనసాగుతున్నది. ఒకవైపు సీఎండీల మధ్య చాంబర్ల పంచాయితీ కొనసాగుతుండగా, డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల్లో సమన్వయం కొరవడి ఇరువర్గాలు గొడవకు దిగుతున్నాయి. తమకు ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల నుంచి కొందరు అధికారులను కేటాయించాలంటూ రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ కొన్ని రోజుల క్రితం లేఖలు రాశారు. దీనిపై స్పందిస్తూ ఉత్తర డిస్కమ్ నుంచి కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపగా వారు వచ్చి విధుల్లో చేరారు. దక్షిణ డిస్కమ్ నుంచి మొత్తం 60 మందిని పంపాలంటూ అడిగితే అందులో 39 మందిని డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ డిస్కమ్ సీఎండీ జితేష్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో కూడా సగం మంది మాత్రమే విధుల్లో చేరగా, మిగతావారు రైతు డిస్కమ్‌కు రావడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన డిస్కమ్‌లోకి రావడానికి అది కూడా హైదరాబాద్‌లోనే పనిచేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఉన్నతాధికారులు అడిగినా వారు ససేమిరా అంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త డిస్కమ్‌లోకి డిప్యుటేషన్‌పై వచ్చిన సీజీఎం స్థాయి అధికారులకు, దక్షిణ డిస్కమ్ ఉన్నతాధికారుల మధ్య గత వారం మింట్ కాంపౌండ్‌లోని కార్పొరేట్ కార్యాలయం ఏ బ్లాక్‌లోని మూడవ అంతస్తులో జరిగిన గొడవపై ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ గొడవకు కారణం దక్షిణ డిస్కమ్‌లో ఒక డైరెక్టరేనని, ఆయనతోపాటు మరో యూనియన్ నేత కలిసి ఈ ఉద్యోగులను రెచ్చగొట్టి వారిపైకి పంపుతున్నారని చర్చించుకుంటున్నారు. కొత్తగా డిస్కమ్ బాధ్యతలు చేపట్టిన ముఖ్య అధికారిని ఈ డైరెక్టర్ తన మాటలతో బోల్తా కొట్టించి ఇష్టానుసారంగా 15 రోజులుగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తున్నది. ఈ రెండు డిస్కమ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు సృష్టించారని ఉద్యోగులే మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే గతవారం జరిగిన గొడవలో రైతు డిస్కమ్‌లో బాధ్యతలు చేపట్టిన ఓ ఉన్నతాధికారిని దక్షిణ డిస్కమ్‌కు చెందిన మరో అధికారి అసభ్యంగా తిడుతూ వేధించడం కలకలం రేపింది. అయితే, దక్షిణ డిస్కమ్‌కు సంబంధించి చాలామంది అధికారుల చాంబర్లు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో కూర్చోకుండా తన సీటు తనకే కావాలంటూ ఎవరికి వారే గొడవలు పడుతుండటంతో డిస్కమ్‌లలో అంతర్గత కుమ్ములాటలు విద్యుత్తు శాఖ పరువును బజారుకీడుస్తున్నాయని మింట్‌కాంపౌండ్‌లో ఉద్యోగులు అంటున్నారు.
రైతు డిస్కమ్, దక్షిణ డిస్కమ్.. ఈ రెండింటిలో ఎక్కడో ఒకచోట మీకు డిప్యుటేషన్ మీద పోస్టింగ్ ఇప్పిస్తానంటూ ఓ సంఘం నేత పెద్ద ఎత్తున పైరవీలు మొదలుపెట్టారని మింట్ కాంపౌండ్‌లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ రెండు డిస్కమ్‌లలో ఖాళీలు ఏర్పడుతుండగా కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తారా? లేక రైతు డిస్కమ్‌లో పనిచేస్తారా? మీరే డిసైడ్ చేసుకోండి.. ప్రతి దానికీ ఓ రేటంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారితో మాట్లాడుతున్నారని, ఇందుకోసం మధ్యవర్తులుగా కొందరు స్థానిక ఉద్యోగులు పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో సీఎండీలకు దగ్గరగా ఉండే ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులతో ఆ యూనియన్ నేతకు సత్సంబంధాలు ఉండటం, మింట్ కాంపౌండ్‌కు దగ్గరలోనే ఉంటూ అన్ని యూనియన్లు, ఇతరులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో ఈ బేరసారాలు మొదలుపెట్టారనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రైతు డిస్కమ్‌కు గ్రీన్భవన్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఇదే సమయంలో ఆ నేత గ్రీన్ భవన్‌లోకి మారిన వెంటనే రెండు డిస్కమ్‌లలో పోస్టింగులు ఇప్పిస్తానంటూ బేరాలు మొదలుపెట్టినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
సాధారణంగా దక్షిణ డిస్కమ్ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలామంది అందునా కొందరు అధికారులు హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ విధుల కోసం వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో వారు హైదరాబాద్‌లో పోస్టింగ్ వస్తే బాగుండునని కోరుకుంటుండటం ఆ నేతకు అవకాశంగా మారిందనే చర్చ నడుస్తున్నది.