కరీంనగర్ కమాన్చౌరస్తా, నవంబర్ 11 : శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ఫస్టియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కళాశాలలో మొత్తం 91 మంది విద్యార్థులు ఉండగా, దాదాపు 40 మంది విద్యార్థులను అధికారులు పరీక్షకు నిరాకరించారు. శాతవాహన యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి మంగళవారం విద్యార్థులు చేరుకున్నారు.
కాగా, హాజరు తక్కువ ఉన్న వారిని పరీక్షకు అనుమతి ఇవ్వకూడదని ముందే నిర్ణయం తీసుకున్న యూనివర్సిటీ అధికారులు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హాజరు తక్కువ ఉన్న విద్యార్థులు అధికారులను వేడుకున్నా ససేమిరా అన్నారు. తక్కువ హాజరు ఉన్నా ఎల్ఎల్బీ ఇంటర్నల్ పరీక్ష రాయొచ్చని గతంతో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు. తమకు ఆ నిబంధనలు వర్తించవని, తాము నిర్ణయించిందే ఫైనల్ అంటూ సమాధానమిచ్చారు. తమతో బయోమెట్రిక్ హాజరు ఎందుకు వేయించుకున్నారని అధికారుల ను ప్రశ్నించగా, తమతో మాట్లాడవద్దంటూ పోలీసులతో వారిని పరీక్ష కేంద్రం బయటకు పంపించారు. అయితే పైరవీలతో వచ్చిన పలువురు విద్యార్థులకు అనుమతి ఇచ్చారని సదరు విద్యార్థులు ఆరోపించారు.