AP Jithender Reddy | పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్‌ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమా చూయించారు. మూవీ ఫట్ కావడంతో హీరో కాస్త జీరో అయిపోయారు. గత ఎన్నికల్లో నమ్మిన పార్టీనే నట్టేట ముంచేందుకు చేసిన ఎత్తుగడలు ఫలించకపోవడంతో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. బీజేపీలో సెటిల్ అయ్యారు. కట్ చేస్తే పొలిటికల్ సినిమాలో తన కొడుకును హీరో చేద్దామనుకొని షాద్‌నగర్ నియోజకవర్గంలో తిప్పుతూ అక్కడి నేతలకు కొరకరాని కొయ్యగా తయారు చేశారు.
షాద్‌నగర్ అభ్యర్థిగా ప్రొజక్ట్ చేయడానికి స్క్రిప్ట్ కూడా తయారు చేశారు. అక్కడ మరో బలమైన బీసీ నేత చేరడంతో వీరి పప్పులు ఉడకలేదు. ఇంకేముంది తన పలుకుబడితో బీజేపీలో చక్రం తిప్పి ఏకంగా మహబూబ్‌నగర్ టికెట్‌ను తన కొడుక్కి ఇప్పించుకున్నారు. టికెట్ ఆశించిన సీనియర్లంతా ఇదేమిటని ముక్కున వేలేసుకొని పార్టీలోంచి చల్లగా జారుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే హేమాహేమీలే వెనుకడుగు వేస్తున్న సమయంలో ఓ బచ్చాగాడికి టికెట్ ఇస్తే ఎలా అని సీనియర్లు గుస్సా అవుతున్నారు. కొడుకు కోసం పాట్లు పడుతున్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పొలిటికల్ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా కూడా ఫట్ అయ్యేలా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-నీమ్కార్ వెంకటేశ్వర్రావు