హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఎట్టకేలకు 317 జీవోకు సంబంధించి ఫైల్‌కు మోక్షం లభించింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో తుదకు స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో 87 మందిని బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం 317 జీవోలో భాగంగా స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో బదిలీలకు వేర్వేరుగా అనుమతులు జారీ చేసింది.
ఈ ప్రక్రియను ఫిబ్రవరి 28లోగా పూర్తిచేయాలని ఆదేశాలిచ్చింది. అయితే, తుది గడువు సమీపించినా గురుకుల సొసైటీలో అందుకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో సొసైటీ ఉన్నతాధికారులు స్పందించారు. స్పౌజ్ క్యాటగిరీలో 81 మందికి, మెడికల్ గ్రౌండ్లో ఆరుగురికి ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించారు.
317 జీవో కింద కొందరికే అవకాశం కల్పించారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సొసైటీలో దాదాపు 130 మంది డిస్లోకెట్, స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల కింద దరఖాస్తు చేసుకోగా, అందులో 87 మందికే అవకాశం ఇచ్చారు. మిగతావి ఎందుకు పెండింగ్ పెట్టారనే విషయాన్ని సొసైటీ వెల్లడించలేదు. దీంతో సదరు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జీవో మార్గదర్శకాల మేరకు తమకు 100 శాతం అర్హత ఉన్నా బదిలీకి అవకాశం ఇవ్వలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అందరికీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.