హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): జీవో-317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొందించి, మంగళవారం సీఎం రేవంత్రెడ్డి దగ్గరికి పంపినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. మంగళవారం సబ్ కమిటీ సీఎంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని పేర్కొన్నాయి. నివేదికను సీఎం ఆమోదిస్తే రెండుమూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి. జీవో 317, జీవో 46పై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో మంత్రి దామోదర అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బా బు, పొన్నం ప్రభాకర్తో సబ్ కమిటీని నియమించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. స్థానికత, భార్యాభర్తలు (స్పౌజ్), మెడికల్, మ్యూ చువల్ ట్రాన్స్ఫర్కు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కమిటీ.. సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలకు పచ్చ జెండా ఊపిందని తెలిసింది. వారి బదిలీలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇక స్థానికతపై ఏం చేయాలనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనిపై మరింత అధ్యయనం అవసరమని కమిటీ భావిస్తున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో అమెరికన్ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు భాగస్వామ్యం పంచుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరారు. అమెరికాలోని లాస్వేగాస్లో మంగళవారం ప్రారంభమైన అంతర్జాతీయ మైన్స్ ఎక్స్పో-2024లో పాల్గొన్న ఆయన అనంతరం పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు, వ్యాపారాలకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, తెలంగాణలో ఖనిజ పరిశ్రమాభివృద్ధికి దోహదపడాలని, అందుకు అవసరమైన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఈ ఎక్స్పోలో 1900 యంత్ర ఉత్పత్తి సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. 121 దేశాల నుంచి 44 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.