పరిగి, జనవరి 27: ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్కువ ధర చెల్లిస్తూ.. కమీషన్ పేరిట 5 శాతం కట్ చేస్తున్నారని ఆరోపించారు. మద్దతు ధర చెల్లించి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని జాతీయ రహదారిపై రెండుగంటల పాటు బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గ్రామాలకు వచ్చే వ్యాపారులు క్వింటాల్ పల్లికి రూ.8 వేలకు పైచిలుకు చెల్లించి కొంటుంటే.. పరిగి మార్కెట్లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
శనివారం పరిగి మార్కెట్లో క్వింటాల్‌కు రూ.6500 కంటే తక్కువ చెల్లించారని మండిపడ్డారు. మార్కెట్లో 12 మంది ఖరీదుదారులుండగా ముగ్గురు వ్యాపారులే కొనుగోళ్లు చేస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఖరీదుదారులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వ్యాపారులతో మార్కెట్ అధికారులు కుమ్మక్కవడంతో రైతు లు నిండా మునుగుతున్నారని వాపోయారు. మద్దతు ధర ఇచ్చేంత వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రాస్తారోకో చేపట్టారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నించారు.
ఇతర మార్కెట్లలో ఎక్కువ ధరకు విక్రయాలు జరుగుతున్నాయని.. పరిగిలో మాత్రం తక్కువ ధరకు కొనుగోళ్లు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మారిపోయింది. ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి రైతులను రోడ్డు పక్కకు నెట్టేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పి, మార్కెట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలతో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి పరిగిలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో విజయకుమారి హెచ్చరించారు. జీతాలు తీసుకుంటూ రైతుల సమస్యలు పరిష్కరించరా అని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ యార్డులోని వేబ్రిడ్జిని పనిచేసేలా చూడాలని సూచించారు. కమీషన్ 2 శాతం కంటే అధికంగా వసూలు చేసిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పరిగికి వస్తానని, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు.
పరిగి మార్కెట్లో రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నా మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదు. టెండర్లలో నాలుగైదు క్వాలిటీల పేరిట తక్కువ ధర ఇస్తున్నారు. టెండర్లలో చెప్పిన ధర కంటే చెల్లింపు సమయంలో రూ.వంద తగ్గించి ఇస్తారు. కమీషన్ 2 శాతం తీసుకోవాల్సి ఉండగా 5 శాతం కట్ చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే పట్టించుకోవడం లేదు. ఇతర ప్రాంతాల వ్యాపారులను ఇక్కడికి రాకుండా అడ్డుకుంటూ ముగ్గురు వ్యాపారులే మార్కెట్లో ఉత్పత్తులు కొంటున్నారు. కొనుగోలుకు రాని వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలి. -వడ్త్య శంకర్, మల్కాయ్పేట్ తండా, పరిగి, వికారాబాద్ జిల్లా
పరిగి మార్కెట్‌కు ఈ రోజు 60 బస్తాల పల్లి తీసుకొచ్చిన. పో యిన వారం క్వింటాల్ రూ.7,400 వరకు కొనగా, ఈ రోజు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు సిండికేటై ధర తగ్గించినా అధికారులు పట్టించుకోవడం లేదు. మాకు మద్దతు ధర చెల్లించి న్యాయం చేయాలి.
– తావుర్యనాయక్, రైతు, ఏర్పుమల్ల